వేమన శతకం (తెలుగు)


తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
తలచి చూడనతకు తత్వమగును
వూఱకుండ నేర్వునుత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 1 ॥

తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి
మిగిలి వెడలవేక మిణుకుచున్న
నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 2 ॥

తనదు మనసుచేత దర్కించి జ్యోతిష
మెంత చేసే ననుచు నెంచి చూచు,
తన యదృష్టమంత దైవ మెఱుంగడా?
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 3 ॥

టీక వ్రాసినట్లేనేకులు పెద్దలు
లోకమందు జెప్పి మంచు
కాకులట్టి జనుల కానరీ మర్మము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 4 ॥

జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి
రెంటినందు రిమ్మరేచునపుడు
రిమ్మ తెలిపెనేని రెండొక రూపురా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 5 ॥

జాణలమని యంద్రు చపలాత్ములగువారు
తెలివిలేక తమ్ముతెలియలేరు
కష్టమైన యడవి గాసీలుచున్నారు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 6 ॥

జనన మరణములన స్వప్న సుషుప్తులు
జగములందు నెండ జగములుండు
నరుడు జగమునంట నడుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 7 ॥

ఛాయననొసగుచెట్లు సాధువు బోధట్టు
లడగి దరినిజేరి పడయవచ్చు
నట్టునిట్టు దాటనది పోవునిది రామ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 8 ॥

నరుడెయైన లేక నారాయణుండైన
తత్త్వబద్ధుడైన దరణి నరయ
మరణమున్నదనుచు మదిని నమ్మగవలె
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 9 ॥

ద్వారంబంధమునకు దలుపులు గడియలు
వలెనె నోటికొప్పుగల నియతులు
ధర్మమెరిగి పలుక ధన్యుండౌ భువిలోన
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 10 ॥

బ్రహ్మఘటము మేను ప్రాణంబు తగగాలి
మిత్రచంద్ర శిఖులు నేత్రచయము
మఱియు బ్రహ్మమనగ మహిమీద లేదయా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 11 ॥

యోగిననుచు గొంత యోగముగూర్చక
జగమునెల్లబట్ట చంపి తినుచు
ధనము కొఱకు వాడు తగవాడుచుండిన
యోగికాడు వాడె యోగు వేమ! ॥ 12 ॥

అర్ధ యంకణమున కాధారమైనట్టి
యొంటిమేడ గుంజు నొనరనిల్పె
నింటికొక మగండె యిల్లాండ్రునేద్గురు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 13 ॥

అన్నదానమునకు నధిక సంపదగల్గి
యమరలోక పూజ్యుడగును మీఱు
అన్నమగును బ్రహ్మమది కనలేరయా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 14 ॥

బొంది యెవరి సొమ్ము పోషింపబలుమారు
ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ,
ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 15 ॥

పండువలన బుట్టె బరగ ప్రపంచము
పండువలన బుట్టె పరము నిహము
పండు మేలెఱింగె బ్రహ్లాదుడిలలోన
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 16 ॥

తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల
నొనర శివుని జూడ నుపమ గలదు
మనసు చదరనీక మహిలోన జూడరా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 17 ॥

తనగుణము తనకు నుండగ
నెనయంగా నోరుని గుణము నెంచును మదిలో
దన గుణము తెలియ కన్యుని
బనిగొని దూషించువాడు వ్యర్థుడు వేమ! ॥ 18 ॥

జాలినొందరాదు జవదాటి కనరాదు
అది మూలమైన ఆత్మమఱుగు
పోరిచేరి పొంది పూర్ణము నందురా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 19 ॥

జాతి, మతము విడిచి చని యోగికామేలు
జాతితో నెయున్న నీతివలదె
మతముబట్టి జాతి మానకుంట కొఱంత
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 20 ॥

నీవనినను నేననినను
భావమ్మున నెఱుకయొక్క పద్ధతియగునా
భావంబు దెలిసి మదిని
ర్భావముగా నిన్ను గనుట పరమగు వేమ! ॥ 21 ॥

నీళ్ల మునుగనేల? నిధుల మెట్టగనేల
మొనసి వేల్పులకును మ్రొక్కనేల
కపట కల్మషములు కడుపులో నుండగా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 22 ॥

పంచ ముఖములందు బంచాక్షరి జనించె
పంచ వర్ణములను ప్రబలె జగము
పంచముఖుని మీరు ప్రస్తుతి చేయుండీ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 23 ॥

నేయి వెన్న కాచి నీడనే యుంచిన
బేరి గట్టిపడును పెరుగురీతి
పోరిపోరి మదిని పోనీక పట్టుము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 24 ॥

మంటికుండవంటి మాయ శరీరంబు
చచ్చునెన్నడైన, చావదాత్మ
ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 25 ॥

మంట లోహమందు మ్రాకుల శిలలందు
పటములందు గోడప్రతిమలందు
తన్నుదెలియు కొఱకుదగులదా పరమాత్మ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 26 ॥

నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ
లింగ జీవావేశులను గాంచి భంగపడక
పూజ మదియందు జేరుట పూర్ణపదవి
పరము గోరిన నిదిచేయ బాగు వేమ! ॥ 27 ॥

ధూమాదుల నావృతమై
వ్యోమంబునకెగని కలియు నుపములు తనలో
శ్రీమించు శివుని జేరును
గామాదుల గలియడతడు ఘనముగ వేమ! ॥ 28 ॥

పగలుడుగ నాసలుడుగును
వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మంబుల్
తగులుడుగు భోగముడిగిన
త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమ! ॥ 29 ॥

పాల నీటి కలత పరమహంస మెఱుగును
నీరు పాలు నెట్లు నేర్చునెమలి
లజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా?
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 30 ॥

పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల
పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ,
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 31 ॥

పరుల విత్తమందు భ్రాంతి వాసినయట్టి
పురుషుడవనిలోన పుణ్యమూర్తి
పరుల విత్తమరయ పాపసంచితమగు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 32 ॥

పరధనంబులకును ప్రాణములిచ్చును
సత్యమంతలేక జారడగును
ద్విజులమంచు నింత్రుతేజమించుకలేదు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 33 ॥

నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు
వ్రాతకన్న సాక్షి వలవదన్న
పరగలేని వ్రాత భంగ పాటుందెచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 34 ॥

నిజమాకల్ల రెండు నీలకంఠుడెఱుంగు
నిజములాడకున్న నీతిదప్పు
నిజములాడునపుడు నీ రూపమనవచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 35 ॥

దశగలారినెల్ల దమ బంధువు లటండ్రు
దశయలేమి నెంత్రు తక్కువగను
దశయన గమ ధన దశమొక్కటే దశ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 36 ॥

తామసించి చేయదగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 37 ॥

తల్లిబిడ్డలకును తగవు పుట్టించెడి
ధనము సుఖము గూర్చునని గడింత్రు
కాని యెల్లయెడల ఘన దుఃఖన్​దమది
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 38 ॥

తల్లిదండ్రులెన్నదగు తొలి గురువులు
పార్వతీభవు లిలబరమగురులు
కూలివాండ్ర జగతి గురులన ద్రోహము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 39 ॥

తామసించి చేయదగ దెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 40 ॥

పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల
పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాంతులు సుమీ,
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 41 ॥

పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి
బుట్టిరేమి వారు గిట్టరేమి
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా!
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 42 ॥

లోకమందుబుట్టి లోకమందె పెరిగి
లోక విభవమోర్వలేక జనుడు
లోకమందు జనికి లోబడి చెడిపోవును
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 43 ॥

మది గలిగిన పూజ మదనారి మెచ్చును
మనసు నిల్సినంత మహితుడగును
మనసులేని పూజ మట్టి సమానము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 44 ॥

తామును జనులేమను కొన
బూనుదురో దాని సరసి పొందిన జడనీ,
రాని పధంబున నడిచిన
దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమ! ॥ 45 ॥

మదము వలన గలుగు మాటలు మఱిపల్కి
మ్రుచ్చు సద్దులనొగి మోసపుచ్చి
కాసురాబెనగెడు కష్ఠుండు గురుడౌనే?
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 46 ॥

మనసే మాయా మృగమౌ
మననేమిటి పైకిగానీ మణిపోనీకా
మనసున మనసును జంపిన
మనందే ముక్తిగలదు మహిలో వేమ! ॥ 47 ॥

మంత్రమొకటి చెప్పి మఱి దేవతార్చన
చేసి తమకుగరుణచెందినదని
వేదపఠన చేసి వెర్రులై పోదురు,
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 48 ॥

మఠములోనియోగి మాయలన్నియుగోసి
ఘటములోన నున్న ఘనునిదెలిసి
మాట మాటకుగురు మరువక తెలుపురా,
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 49 ॥

తిరిగి వచ్చువేళ మరలిపోయెడి వేళ
వెంట దేరు ధనము వంటబోరు
తొనెటకు జనునొ ధనమెందు బోవునో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 50 ॥

ఆశయనెడు దాని గోసివేయగాలేక
మొహబుద్ది వలన మునుగువారు
కాశివాసులైన గనబోరు మోక్షము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 51 ॥

చిత్తమనేడి వేరే శిథిలమైనప్పుడే
ప్రకృతి యనెడి చెట్టు పడును పిదప
గోర్కులనెడి పెద్దకొమ్మలెండును గదా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 52 ॥

భోగంబుల కాశింపక
రాగద్వేషంబు రంగుడదమలో
వేగమె మోక్ష పదంబును
రాగను నాతండు యోగిరాయుడు వేమ! ॥ 53 ॥

చనువారెల్లను జనులం
జనిపోయిన వారి పుణ్య సత్కథలెల్లన్
వినవలె గనవలె మనవలె
నని మషులకు దెలుసగూడ దంత్యము వేమ! ॥ 54 ॥

ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనంబులు
కట్టుపడుచు ముక్తిగానరైరి
జ్ఞానఖడ్గమునను ఖండింప రాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 55 ॥

అతిథి రాక చూచి యదలించి పడవైచి
కఠిన చితులగుచు గానలేరు
కర్మమునకు ముందు ధర్మము గానరో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 56 ॥

తను వలచిన దావలచును తను
వలవక యున్ననెనడు తావలవ డిలన్
తనదు పటాటోపంబులు తన
మాయలు పనికిరావు ధరలోన వేమ! ॥ 57 ॥

మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు
తెలుపవచ్చు దన్ను తెలియలేదు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 58 ॥

తనకేనాడు సుభిక్షము
తనకేనాడును భగంబు తనరవయునం
చును తన దశకై యెల్లెడ
మనసందున జివుకుచుండు మహిలో వేమ! ॥ 59 ॥

ఎండిన మా నొకటడవిని
మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్
దండిగల వంశమెల్లను
చండాలుండొకడు పుట్టి చదుపును వేమ! ॥ 60 ॥

నిజము తెలిసియున్న సుజినుడానిజమునె
పలుకవలయుగాని పరులకొరకు
చావకూడ దింక నోపదవ్యం పల్క
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 61 ॥

తామును జనులేమను కొన
బూనుదురో దాని సరసి పొందిన జడనీ,
రాని పధంబున నడిచిన
దాననె ధర్మాత్ముడండ్రు తన్నిట వేమ! ॥ 62 ॥

వినియు వినకయుండు కనియు గనక యుండు
తలచి తలపకుండు తాను యోగి
మనుజవరులచేత మణిపూజ గొనుచుండు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 63 ॥

వెన్న చేతబట్టి వివరంబు తెలియక
ఘృతము కోరునట్టి యతని భండి
తాను దైవమయ్యు దైవంబు దలచును
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 64 ॥

రూపువంక పేరు రూఢిగా నిలుచును
పేరువంక క్రియలు పెనగుచుండు
నాశమౌను తుదకు నామరూప క్రియల్
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 65 ॥

లోభమోహములను ప్రాభవములు తప్పు
తలచిన పనులెల్ల తప్పి చనును
తానొకటి దలచిన దైవమొండగుచుండు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 66 ॥

శాంతమే జనులను జయమునొందించును
శాంతముననె గురువు జాడ తెలియు
శాంత భావ మహిమ జర్చింపలేమయా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 67 ॥

వేషధారినెపుడు విశ్వసింపగరాదు
వేషదోషములొక విధయె యగును
రట్టుకాదె మునుపు రావణు వేషంబు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 68 ॥

ఇంగలంబు తోడ నిల సల్పుతోడను
పరుని యాలితోడ పతితుతోడ
సరసమాడుటెల్ల చావుకు మూలము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 69 ॥

ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు
దాని బలిమి నెంతయైన గూడు
గడ్డి వెంట బెట్టి కట్టరా యేనుంగు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 70 ॥

తామసించి చేయదగదెట్టి కార్యంబు
వేగిరింప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనా?
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 71 ॥

తల్లీ బిడ్డలకు తగవు పుట్టించెడి
ధనము సుఖము గూర్చునని గడింత్రు
కానీయెల్ల యెడల ఘన దుఃఖకరమది
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 72 ॥

దొంగమాటలాడ దొరుకునె మోక్షము
చేతగాని పలుకు చేటుదెచ్చు
గురువుపద్దు కాదు గునహైన్య మదియగు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 73 ॥

నలుగురు కల చోటను దా
దల చూపుచు మెలగుచుండి ధన్యాత గనగా
దలచెడి యాతడు నిచ్చలు
గల మాటలే పలుకుచుండగా దగు వేమ! ॥ 74 ॥

నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని
కడుపు చల్లజేసి ఘనత విడుచు
నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 75 ॥

పదుగురాడుమాట పాడియై ధరజెల్లు
నొక్కడాడుమాట యెక్కదెందు
వూరకుండు వాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 76 ॥

పతక మందు నొప్పు పలు రత్నముల పెంపు
బంగరందు కూర్ప బరువు గనును
గాని యితర లోహమైన హీనము గాదె
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 77 ॥

జన్నములను మరియు జన్నియల ననేక
ముల నొనర్చియున్న ఫలముకాన
రాక యుండు నీతి లేకున్న మాత్రాన
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 78 ॥

తప్పు పలుకు పలికి తాతోట చేసిన
కూడియున లక్ష్మీ క్రుంగిపోవు
నోటికుండ నీళ్ళు నొనరగా నిలుచునా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 79 ॥

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుँ జూచి ధనము నవ్వు
కదన భీతుँ జూచి కాలుँడు నవ్వును
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 80 ॥

నీతి జ్యోతిలేక నిర్మలంబగు నేది
ఎట్లు కలగుబర మదెంతయైన
ధనము గలిగియున్న దైవంబు గలుగదు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 81 ॥

పగయుడగు గోపముడిగిన
పగయుడుగన్​ కోర్కెలుడుగు బరజన్మంపుం
దగులుడుగు భేదముడిగిన
త్రిగుణము లుడుగంగ ముక్తి స్థిరమగు వేమ! ॥ 82 ॥

పప్పులేని కూడు పరులకోసహ్యమే
యుప్పులేని వాడె యధిక బలుడు
ముప్పులేని వాడు మొదటి సుజ్జానిరా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 83 ॥

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాలు తట్టెడేల
చదువ పద్యమరయ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 84 ॥

పరుల దత్తమొప్పి పాలనచేసిన
నిల స్వదత్తమునకు విను మడియగు
నవని పరుల దత్త మహపరింపగ రాదు
విశ్వధాబిరామ వినుర వేమ! ॥ 85 ॥

నిజములాడు వాని నిందించు జగమెల్ల
నిజము బల్కరాదు నీచులకడ
నిజ మహాత్ముగూడ నిజమాడవలయురా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 86 ॥

పదుగురాడుమాట పాడియై ధరజెల్లు
నొక్కడాడుమాట యెక్కదెందు
వూరకుండు వాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 87 ॥

పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు
వట్టి మాటలాడు వాడధముడు
అట్టి వాని బ్రతుకు టదియేల మంటికా
విశ్వధాబిరామ వినుర వేమ! ॥ 88 ॥

భయమంతయు దేహమునకె
భయ ముడిగిన నిశ్చయంబు పరమాత్మునకే
లయమంతయు జీవునకే
జయమాత్మకు ననుచు జగతిँ జాటుర వేమ! ॥ 89 ॥

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుँ జూచి ధనము నవ్వు
కదన భీతుँ జూచి కాలుँడు నవ్వును
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 90 ॥

మాటజెప్ప వినని మనుజుడు మూర్ఖుడు
మాట విన్న నరుడు మానుడగును
మాట వినగ జెప్ప మానుట కూడదు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 91 ॥

మనసు తెలిసి యొకని మాటకు బ్రతిచెప్ప
సంతసించు నతడు చాలమెచ్చు
మనసు దెలియకున్నడనియుచు ననునేదో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 92 ॥

ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి
వేరేపోవువాడు వెర్రివాడు
కుక్కతోక పట్టి గోదారీదినా?
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 93 ॥

జ్ఞానియైనవాని మానక పూజించు
మనుజుడెప్పుడు పరమునను ముదంబు
సుఖమునందుచుండుసూరులు మెచ్చగ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 94 ॥

హాని కలుగబోదు హరిమది నెంచెడు
వాని కబ్దు పరము వసుధయందు
పూని నిష్ఠమీరి పొదలక యుండుము
విశ్వరాభిరామ వినుర వేమ! ॥ 95 ॥

అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచు మోగినట్లు కనకంబు మోగునా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 96 ॥

న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దించు
ధర్మశాస్త్ర మొసగు రుగ్మతంబు
జ్యోతిషము జనముల నీతుల దప్పించు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 97 ॥

దేవుడనగ వేరే దేశముందున్నాడె
దేహితోడ నెపుడు దేహమందె
వాహనములనెక్కి పడిదోలుచున్నాడు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 98 ॥

భూమిలోన బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్త్వమెల్ల
శ్రమలోన బుట్టు సర్వంబు తానౌను
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 99 ॥

వ్రాతకంటె హెచ్చు పరమీదు దైవంబు
చేతకంటె హెచ్చు వ్రాత లేదు
వ్రాత కజుడు కర్త చేతకు దాకర్త
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 100 ॥

చిప్పలోనబడ్డ చినుకు ముత్యంబయ్యె
నీట బడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 101 ॥

ఇంటి ఇంటిలోననీశ్వరుడుండగ
నంటి చూడలేక యడవులందు
నుంట మేటంచునుందురా జోగులై
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 102 ॥

చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదవగాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంతో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 103 ॥

అగ్నిబానా మేసి యంబుధి నింకించు
రాముడవలి కేగ రాక, నిలిచి
చెట్లు గిరులు తెచ్చి సేతువు గట్టడా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 104 ॥

ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయు
నం దొకండు విడ్డ పొందు చెడును
స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 105 ॥

ఆత్మబుద్ధి వలన నఖిలంబ తానయ్యె
జీవబుద్ధి వలన జీవుడయ్యె
మోహబుద్ధిలయము ముందర గనుగొను
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 106 ॥

గుణములోగలవాని కులమెంచగానేల
గుణము కలిగెనేని కోటిసేయు
గణములేక యున్న గుడ్డిగవ్వయులేదు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 107 ॥

తల్లితండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 108 ॥

కోపమున ఘనత కొంచెమైపోవును
కోపమునను గుణము కొరతపడును
కోపమణచనేని కోరికలీడేరు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 109 ॥

ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా
నలుపు నలుపేకాని తెలుపుకాదు
కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 110 ॥

అల్పబుద్ధివానికధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 111 ॥

పట్టుపట్టరాదు పట్టివిడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 112 ॥

తుమ్మచెట్టు ముండ్ల తోడనేపుట్టును
విత్తులొననుండు వెడలునట్లు
మూర్ఖునకును బుద్ధి ముందుగా బుట్టను
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 113 ॥

కపటి వేషమూని కడగండ్లు పడనేల
విపిన భూమి తిరిగి విసుగనేల
యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా
విశ్వదాభి రామ వినుర వేమ ॥ 114 ॥

అనువుగాని చోట అధికులమనరాదు
కొంచెముందుటెల్ల కొదువకాదు
కొండ యద్దమందు కొంచమై ఉండదా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 115 ॥

మనసులోనున్న మర్మమంత ఎరిగి
స్థిరము చేసి ఆత్మ తేటపరిచి
ఘటము నిల్పవలయు, ఘనతలింకేటికి
విశ్వదాభి రామవినుర వేమ! ॥ 116 ॥

కదలనీయకుండ గట్టిగా లింగంబు
కట్టివేయనేమి ఘనత కలుగు
భావమందు శివుని భావించి కానరా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 117 ॥

మేక జంకబెట్టిమెలగుచు మందలో
బ్రమని తిరుగు గొల్ల పగిదిగాను
దేవునెరుగక పరదవేతల దలచు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 118 ॥

తన కుల గోత్రము లాకృతి
తన సంపద కలిమి బలిమి తనకేలనయా?
తన వెంటరావు నిజమిది
తన సత్యమే తోడువచ్చు తనతో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 119 ॥

కలిమిగల్గనేమి కరుణ లేకుండిన
కలిమి తగునె దుష్టకర్ములకును
తేనెగూర్పనీగ తెరువున బోవదా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 120 ॥

ఎండిన మానొకటడవిని
మండిన నందగ్ని పుట్టి యూడ్చును చెట్లన్
దండిగల వంశమెల్లను
చండాలుండొకడు పుట్టి చదువును వేమ! ॥ 121 ॥

కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు
ఉభయులరయుగూడి యుండినట్లు
పేద పేద గూడి పెనగొని యుండును
విశ్వదాభిరామా వినుర వేమ! ॥ 122 ॥

మాటలాడు గల్గు మర్మములెరిగిన
పిన్నపెద్దతనము లెన్నవలదు
పిన్నచేతి దివ్వె పెద్దగా వెలగదా?
విశ్వధాభిరామ వినుర వేమ! ॥ 123 ॥

కొండముచ్చు పెండ్లికి కోతి పేరంటాలు
మొండి వాని హితుడు బండవాడు
దుండగీడునకును కొండెడు దళవాయి
విశ్వదాభిరామా వినుర వేమ! ॥ 124 ॥

ఝుషము నీరు వెడల జచ్చుటే సిద్ధము
నీటనుండనేని నిక్కిపడును
అండతొలుగు నెడల నందర పని అట్లే
విశ్వదాభి రామ వినుర వేమ! ॥ 125 ॥

తల్లియేడ్వ వినక తనయాలు వగచిన
జాలిపడెడు వాడు జడుడు సుమ్మి
తారతమ్య మెరుగనేరని పశువది
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 126 ॥

పరులమేలు చూసి పలుకాకి వలె
వట్టిమాటలాడు వాడు అధముడు
అట్టివాని బతుకుటది ఏల మంటికా?
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 127 ॥

గంగి గోవుపాలు గరిటడైనను చాలు
కడవెడైనను నేమి ఖరముపాలు
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 128 ॥

చిక్కియున్నవేళ సింహంబునైనను
బక్క కుక్కయైనా బాధసేయు
బలిమిలేని వేళ పంతములు చెల్లవు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 129 ॥

పనసతొనలకన్న పంచదారలకన్న
జుంటితేనెకన్న జున్నుకన్న
చెఱుకు రసముకన్న చెలుల మాటలె తీపి
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 130 ॥

నిండునదులు పారు నిలచి గంభీరమై
వెఱ్రివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 131 ॥

ఉప్పులేనికూర యొప్పదు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
అప్పులేనివాడె యధిక సంపన్నుడు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 132 ॥

పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి
పుష్పజాతి వేరు పూజ ఒకటి
దర్శనంబులారు దైవంబు ఒక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 133 ॥

చంపదగిన శతృవు తనచేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 134 ॥

ఆపదగల వేళ అరసి బంధువు జూడు
భయము వేళ జూడు బంటుతనము
పేదవేళ జూడు పెండ్లాము గుణము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 135 ॥

ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 136 ॥

ఆత్మ శుద్ది లేని యాచారమదియేల
భాండశుద్ది లేని పాక మేల
చిత్తశుద్దిలేని శివపూజలేలరా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 137 ॥

యినుము విరగనేని యినుమూరు ముమ్మారు
కాచియెతకవచ్చు గ్రమము గాను
మనసు విరిగెనేని మరి చేర్చరాదయా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 138 ॥

కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటి కాదె
భాష లిట్టె వేరు పరతత్వమొకటె
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 139 ॥

అనగ ననగ రాగ మతిశ యిల్లుచునుండు
దినగ దినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 140 ॥

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కంటిలోని నలుసు కాలి ముల్లు
ఇంటిలోని పోరు నింతింత గాదయా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 141 ॥

తప్పు లెన్నువారు తండోప తండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 142 ॥

మిరప గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి జూడలోన జురుకుమనును
సజ్జను లగు వారి సార మిట్లుండు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 143 ॥

మేడిపండు చూడ మేలిమై యుండును
పొట్టవిచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 144 ॥

వేరు పురుగు చేరి వృక్షంబు జెరుచును
చీడపురుగు చేరి చెట్టు జెరచు
కుత్సితుండు చేరి గుణవంతు జెరచురా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 145 ॥

వేషభాష లెరిగి కాషయవస్త్రముల్
గట్టగానె ముక్తి గలుగబోదు
తలలు బోడులృన తలపులు బోడులా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 146 ॥

తరచుగా అడిగే ప్రశ్నలు

What is వేమన శతకం (తెలుగు)?

వేమన శతకం (తెలుగు) is a devotional text available on Bhakti Granth in the selected language or script.

Which language or script is this version in?

This edition is published in Telugu. Use the language selector to view another available edition.

Can I read వేమన శతకం (తెలుగు) online?

Yes. The imported text is available directly on this page for online reading and recitation.

Can I download వేమన శతకం (తెలుగు) as a PDF?

If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.

How can I share this page?

Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.

Are there related devotional texts on Bhakti Granth?

Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.

WhatsApp Facebook