పాహి రామప్రభో


రాగం: మధ్యమావతి
తాళం: ఝంప

పాహిరామప్రభో పాహిరామప్రభో
పాహిభద్రాద్రి వైదేహిరామప్రభో ॥ పాహిరామప్రభో ॥

శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీ
నామకీర్తనలు వర్ణింతు రామప్రభో ॥ 1 ॥ పాహిరామప్రభో ॥

సుందరాకార హృన్మందిరోద్ధార సీ
తేందిరా సంయుతానంద రామప్రభో ॥ 2 ॥ పాహిరామప్రభో ॥

ఇందిరా హృదయారవిందాదిరూఢ
సుందారాకార ఆనంద రామప్రభో ॥ 3 ॥ పాహిరామప్రభో ॥

ఎందునేజూడ మీసుందరాననము
కందునో కన్నులింపొంద రామప్రభో ॥ 4 ॥ పాహిరామప్రభో ॥

పుణ్యచారిత్రలావణ్య కారుణ్య గాం
భీర్య దాక్షిణ్య శ్రీరామచంద్రప్రభో ॥ 5 ॥ పాహిరామప్రభో ॥

కందర్పజనక నాయందు రంజిల సదా
నందుడవై పూజలందు రామప్రభో ॥ 6 ॥ పాహిరామప్రభో ॥

ఇంపుగా జెవులకు న్విందుగా నీకథల్‌
కందుగా మిమ్ము సొంపొంద రామప్రభో ॥ 7 ॥ పాహిరామప్రభో ॥

వందనముచేసి మునులందరు ఘనులైరి
విందవైనట్టి గోవింద రామప్రభో ॥ 8 ॥ పాహిరామప్రభో ॥

బృందారకాది సద్బృందార్చితావతార
వింద ముని సందర్శితానంద రామప్రభో ॥ 9 ॥ పాహిరామప్రభో ॥

తల్లివినీవె మాతండ్రివినీవె మా
ధాతవునీవె మాభ్రాత రామప్రభో ॥ 10 ॥ పాహిరామప్రభో ॥

పల్లవాధరలైన గొల్లభామలగూడి
యుల్లమలరంగ రంజిల్లు రామప్రభో ॥ 11 ॥ పాహిరామప్రభో ॥

మల్లరంగంబునందెల్ల మల్లులజీరి
యల్ల కంసుని జంపు మల్ల రామప్రభో ॥ 12 ॥ పాహిరామప్రభో ॥

కొల్లలుగ నీమాయ వెల్లివిరియగ జేయ
సల్లాపమున క్రీడసల్పు రామప్రభో ॥ 13 ॥ పాహిరామప్రభో ॥

తమ్ముడును నీవు పార్శ్వమ్ములంజేరి వి
ల్లమ్ములెక్కెడి నిల్చుటిమ్ము రామప్రభో ॥ 14 ॥ పాహిరామప్రభో ॥

క్రమ్ముకొనిశాత్రవులు హుమ్మనుచువచ్చెదరు
ఇమ్మైనబాణములిమ్ము రామప్రభో ॥ 15 ॥ పాహిరామప్రభో ॥

రమ్ము నాకభయమ్ము నిమ్ము నీపాదముల్‌
నమ్మినానయ్య శ్రీరామచంద్రప్రభో ॥ 16 ॥ పాహిరామప్రభో ॥

కంటి మీ శంఖమ్ము కంటి మీ చక్రము
కంటి మీ పాదముల్గంటి రామప్రభో ॥ 17 ॥ పాహిరామప్రభో ॥

వింటి మహిమ వెన్నంటి తమ్ముడు నీవు
జంటరావయ్య నావెంట రామప్రభో ॥ 18 ॥ పాహిరామప్రభో ॥

మేము నీవారమైనాము రక్షింపుమ
న్నాము జాగేల శ్రీరామచంద్రప్రభో ॥ 19 ॥ పాహిరామప్రభో ॥

నామనోవీధిని ప్రేమతోనుండు మీ
భూమిజాసహిత జయ రామచంద్రప్రభో ॥ 20 ॥ పాహిరామప్రభో ॥

మీ మహత్త్వమ్ము విన మనమందు ప్రేమ
వేమరున్‌ బుట్టు శ్రీరామచంద్రప్రభో ॥ 21 ॥ పాహిరామప్రభో ॥

శ్యామసుందర కోమలం జానకీమనః
కాముకం త్వం భజే రామచంద్రప్రభో ॥ 22 ॥ పాహిరామప్రభో ॥

కామితార్థములిచ్చు నీ మహత్వము విన్న
నా మొరాలించు నాస్వామి రామప్రభో ॥ 23 ॥ పాహిరామప్రభో ॥

కామితప్రభుడవై ప్రేమతో రక్షించు
స్వామి సాకేతపురి రామచంద్రప్రభో ॥ 24 ॥ పాహిరామప్రభో ॥

అన్న రావన్న నీకన్న నామీద నెన
రున్న వారేరి నాయన్న రామప్రభో ॥ 25 ॥ పాహిరామప్రభో ॥

నిన్నెగాకను మరే యన్యులగానన్‌
గన్నతండ్రివిగ మాయన్న రామప్రభో ॥ 26 ॥ పాహిరామప్రభో ॥

వెన్నదొంగిలి తిన్న చిన్నకృష్ణమ్మ ని
న్నెన్నగా వశమె రావన్న రామప్రభో ॥ 27 ॥ పాహిరామప్రభో ॥

ఎన్నెన్నో జన్మముల నెత్తజాలను ఇక
నిన్నె నెమ్మదిని వర్ణింతు రామప్రభో ॥ 28 ॥ పాహిరామప్రభో ॥

ఎన్నివిధములనైన నిన్నె నమ్మిన వాని
మన్నించి దయచేయుమన్న రామప్రభో ॥ 29 ॥ పాహిరామప్రభో ॥

పన్నగాధిపశాయి భావనాతీత ఆ
పన్న నామనవి వినవన్న రామప్రభో ॥ 30 ॥ పాహిరామప్రభో ॥

మేటివాక్యంబు మీసాటిదైవంబు ము
మ్మాటికిని భువిలేదు మేటి రామప్రభో ॥ 31 ॥ పాహిరామప్రభో ॥

పాడుదును మిమ్ము గొనియాడుదును మోదమున
వేడుచున్నాను గాపాడు రామప్రభో ॥ 32 ॥ పాహిరామప్రభో ॥

వేడుకోగానె నీజోడుకాడును నీవు
కూడి రారయ్య నాతోడ రామప్రభో ॥ 33 ॥ పాహిరామప్రభో ॥

నేడు నాకోర్కె లీడేరగాజేసి కా
పాడరా కరినేలు జాడ రామప్రభో ॥ 34 ॥ పాహిరామప్రభో ॥

మూడుమూర్తుల కాత్మమూలమై చెన్నొందు
వాడవని శ్రుతులు నిన్నాడు రామప్రభో ॥ 35 ॥ పాహిరామప్రభో ॥

చూడు మీభక్తులను గూడు మీరిపుల గో
రాడు మీవల్ల గోవింద రామప్రభో ॥ 36 ॥ పాహిరామప్రభో ॥

పుండరీకాక్ష మార్తాండవంశోద్భవా
ఖండలస్తుత్య కోదండ రామప్రభో ॥ 37 ॥ పాహిరామప్రభో ॥

కుండలిశయన భూమండలోద్ధరణ పా
షండజనహరణ కోదండరామప్రభో ॥ 38 ॥ పాహిరామప్రభో ॥

నిండుదయతోడ నాయండ బాయకను నీ
వుండి గాపాడు కోదండరామప్రభో ॥ 39 ॥ పాహిరామప్రభో ॥

జాతకౌతూహలం చక్షుకృత్యారమాం
పూతసీతాపతే దాత రామప్రభో ॥ 40 ॥ పాహిరామప్రభో ॥

పాతకులలో మొదటి పాతకుడ నావంటి
పాతకుని కావుటే ఖ్యాతి రామప్రభో ॥ 41 ॥ పాహిరామప్రభో ॥

భూతనాథుని విల్లు ఖ్యాతిగా ఖండించి
సీతగైకొన్న విఖ్యాత రామప్రభో ॥ 42 ॥ పాహిరామప్రభో ॥

పూతనాకల్మషోద్ధూత పెన్‌శత్రు సం
హారి శ్రీసీతాసమేత రామప్రభో ॥ 43 ॥ పాహిరామప్రభో ॥

జాతినీతులులేక భూతలంబున దిరుగు
ఘాతకుల బరిమార్చు నేత రామప్రభో ॥ 44 ॥ పాహిరామప్రభో ॥

ఎప్పుడును గంటికి రెప్పవలె గాచి న
న్నొప్పుగాగావు మాయప్ప రామప్రభో ॥ 45 ॥ పాహిరామప్రభో ॥

ఏదయా నీదయా యోదయాంభోనిధీ
యాదిలేదయ్య నామీద రామప్రభో ॥ 46 ॥ పాహిరామప్రభో ॥

ఘోరరాక్షస గర్వహార విశ్వంభరో
ద్ధార గుణసాంద్రవిస్తార రామప్రభో ॥ 47 ॥ పాహిరామప్రభో ॥

మోదమున నీవు నన్నాదుకోవయ్య గో
దావరీ తీర భద్రాద్రి రామప్రభో ॥ 48 ॥ పాహిరామప్రభో ॥

నీదు బాణంబులను నాదుశత్రులబట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో ॥ 49 ॥ పాహిరామప్రభో ॥

ఆదిమధ్యాంత బహిరాంతరాత్ముడవనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో ॥ 50 ॥ పాహిరామప్రభో ॥

చాలదేమి పదాబ్జములసాటి యీపదు
నాల్గులోకంబుల గూడి రామప్రభో ॥ 51 ॥ పాహిరామప్రభో ॥

ఏల యీలాగు జాగేల జేసెదవు మ
మ్మేలుకోవయ్య మాపాలి రామప్రభో ॥ 52 ॥ పాహిరామప్రభో ॥

పాలువెన్నలు మ్రుచ్చిలింతివని యశోద
రోటగట్టిన మాయచాలు రామప్రభో ॥ 53 ॥ పాహిరామప్రభో ॥

కొల్లలుగ వ్రేపల్లె పల్లవాధరులతో
నల్లబిల్లిగను రంజిల్ల రామప్రభో ॥ 54 ॥ పాహిరామప్రభో ॥

వాలి నొక్కమ్మునన్‌ గూలవేసిన శౌర్య
శాలియౌ నినుదలతు జాల రామప్రభో ॥ 55 ॥ పాహిరామప్రభో ॥

సాలభంజికల నిర్మూలంబు చేయగా
జాలితివి గోపాలబాల రామప్రభో ॥ 56 ॥ పాహిరామప్రభో ॥

తాళవృక్షము లొక్కకోల ధరగూలగా
లీలనేసిన బాహుశాలి రామప్రభో ॥ 57 ॥ పాహిరామప్రభో ॥

(శిలయైన యహల్య శ్రీపాదములు
సోక నెలతయై మిము మదితలచె ॥ 58 ॥ పాహిరామప్రభో ॥)

వినవయ్య మనవి గైకొనవయ్య తప్పులన్‌
గనకయ్య సమ్మతిన్గొనుచు రామప్రభో ॥ 59 ॥ పాహిరామప్రభో ॥

దానధర్మంబులున్‌ దపజపంబులు నీదు
నామకీర్తనకు సరిరావు రామప్రభో ॥ 60 ॥ పాహిరామప్రభో ॥

మానావమానములు మహిని నీవై యుండ
మాకేల మదిని ఈచింత రామప్రభో ॥ 61 ॥ పాహిరామప్రభో ॥

జ్ఞానయోగాభ్యాసమందు నుండెడివారి
కానందమయుడవైనావు రామప్రభో ॥ 62 ॥ పాహిరామప్రభో ॥

భానువంశమునందు మానవాధిపుడవై
దానవుల బరిమార్చినావు రామప్రభో ॥ 63 ॥ పాహిరామప్రభో ॥

అణురేణు పరిపూర్ణుడౌ హృదయవాస నా
మనవి విను దేవకీతనయ రామప్రభో ॥ 64 ॥ పాహిరామప్రభో ॥

మాన్యమై ఆశ్రితవదాన్యమై సుజన స
న్మాన్యమై వెలుగు మూర్ధన్య రామప్రభో ॥ 65 ॥ పాహిరామప్రభో ॥

నిత్యమై సత్యమై నిర్మలంబై మహిని
దివ్యవంశోత్తంసమైన రామప్రభో ॥ 66 ॥ పాహిరామప్రభో ॥

సేవ్యమై మీపదద్భావ్యమై సజ్జన
శ్రావ్యమై యుండునో దివ్య రామప్రభో ॥ 67 ॥ పాహిరామప్రభో ॥

గట్టిగా నీవునన్‌ పట్టుగా విహితమౌ
నట్టుగా మమ్ము చేపట్టు రామప్రభో ॥ 68 ॥ పాహిరామప్రభో ॥

దిట్టయగు తాటకినిగొట్టి వేగమె గాధి
పట్టి యాగము గాచినట్టి రామప్రభో ॥ 69 ॥ పాహిరామప్రభో ॥

చుట్టుకొని కాళింగు డట్టహాసముచేయ
పట్టుకొని తలనెక్కినట్టి రామప్రభో ॥ 70 ॥ పాహిరామప్రభో ॥

సంతతము నన్ను రక్షింతువని నమ్మి మి
మ్మెంతురా జానకీకాంత రామప్రభో ॥ 71 ॥ పాహిరామప్రభో ॥

పంతమున మీ పాదచింతనము చేయ నా
వంతలన్నియు మానుటెంత రామప్రభో ॥ 72 ॥ పాహిరామప్రభో ॥

వింతగాదయ్య నేనింతనాడినది నా
పంతమున మిమ్ము భావింతు రామప్రభో ॥ 73 ॥ పాహిరామప్రభో ॥

శాంతమూర్తిని రమాకాంతుడవని చాల
సంతసంబున నిన్ను నెంతు రామప్రభో ॥ 74 ॥ పాహిరామప్రభో ॥

అక్షయంబైన నీకుక్షిలో లోకముల
రక్షించితివి లక్ష్మీవక్ష రామప్రభో ॥ 75 ॥ పాహిరామప్రభో ॥

దంతివత్సల భక్తచింతామణీ విశ్వ
మంతయును నీవు రక్షించు రామప్రభో ॥ 76 ॥ పాహిరామప్రభో ॥

పక్షివాహన శత్రునిక్షేపణా నన్ను
రక్షించు మోక్షప్రదాత రామప్రభో ॥ 77 ॥ పాహిరామప్రభో ॥

రక్షించి సజ్జనుల వీక్షించి దుర్జనుల
రాక్షసుల శిక్షించినావు రామప్రభో ॥ 78 ॥ పాహిరామప్రభో ॥

రక్షకుడవై జగద్రక్షణముచేయగా
రాక్షసుల శిక్షించినావు రామప్రభో ॥ 79 ॥ పాహిరామప్రభో ॥

లక్ష్మీకటాక్ష వీక్షణధార వృష్టి మా
కక్షయంబుగ కటాక్షించు రామప్రభో ॥ 80 ॥ పాహిరామప్రభో ॥

రావయా అభయంబు లీవయా నాస్వామీ
నీవయా గతి దేవరాయ రామప్రభో ॥ 81 ॥ పాహిరామప్రభో ॥

కావు కావుమటంచు కాకాసురుడురాగ
కాచి రక్షించినావయ్య రామప్రభో ॥ 82 ॥ పాహిరామప్రభో ॥

దేవదేవోత్తమా దేవేంద్రసన్నుతా
కావవేనన్ను శ్రీరామచంద్రప్రభో ॥ 83 ॥ పాహిరామప్రభో ॥

భావజజనక నా బాధలన్నియుమాన్పి
యే విధంబునైన నేలు రామప్రభో ॥ 84 ॥ పాహిరామప్రభో ॥

శ్రీవైష్ణవులపాలి చింతామణివి చాల
సేవగైకొని కరుణచేయు రామప్రభో ॥ 85 ॥ పాహిరామప్రభో ॥

భావమున మిముభక్తి సేవించు జనులకు
కైవల్యమొసగు శ్రీరామచంద్రప్రభో ॥ 86 ॥ పాహిరామప్రభో ॥

గోపాలురను గూడి యావులను మేపి
ఆపదోద్ధారకుడవైన రామప్రభో ॥ 87 ॥ పాహిరామప్రభో ॥

నాపాలి శ్రీరామ భూపాలకా నను
కాపాడరావ గోపాల రామప్రభో ॥ 88 ॥ పాహిరామప్రభో ॥

సారమౌశౌర్య విస్తారమౌ సుందరా
కారసద్భక్తమందార రామప్రభో ॥ 89 ॥ పాహిరామప్రభో ॥

శరణాగతత్రాణ బిరుదాంకితంబైన
వరము నాకొసగు యేమరక రామప్రభో ॥ 90 ॥ పాహిరామప్రభో ॥

శ్రీరామ రామేతి శ్రేష్ఠమంత్రము సారె
సారెకును వింతగా జదువ రామప్రభో ॥ 91 ॥ పాహిరామప్రభో ॥

శ్రీరామ నీనామ చింతనామృతపాన
సారమే నాదుమది గోరు రామప్రభో ॥ 92 ॥ పాహిరామప్రభో ॥

చేరి మీపాద పద్మారాధనము చేయ
కోరినానయ్య శ్రీరామచంద్రప్రభో ॥ 93 ॥ పాహిరామప్రభో ॥

ఘోరరాక్షసగర్వహారి విశ్వంభరా
భూరిగుణసాంద్ర విస్తార రామప్రభో ॥ 94 ॥ పాహిరామప్రభో ॥

మారీచమాయానివార శరసంధాన
ధారుణీతనయా విహార రామప్రభో ॥ 95 ॥ పాహిరామప్రభో ॥

పరవాసుదేవ యక్షయపాత్ర మొసగి న
న్నరసి పోషింపగదవయ్య రామప్రభో ॥ 96 ॥ పాహిరామప్రభో ॥

పరధనంబును పరస్త్రీల నపేక్షించు
నరుకబ్బునే మోక్షమరయ రామప్రభో ॥ 97 ॥ పాహిరామప్రభో ॥

కామాదిదుర్గుణ స్తోమంబులడగ మీ
నామామృతమె దిక్కు రామచంద్రప్రభో ॥ 98 ॥ పాహిరామప్రభో ॥

దుష్టులగు దానవుల నష్టంబుగా జేయగా
బుట్టితివి కౌసల్య పట్టి రామప్రభో ॥ 99 ॥ పాహిరామప్రభో ॥

కష్టపడలేనయ్య పట్టాభిరామ నా
కిష్టసంపదలిచ్చి యేలు రామప్రభో ॥ 100 ॥ పాహిరామప్రభో ॥

కేశవాయనిన భవపాశముళొలగు స
ర్వేశకోటి శశిప్రకాశ రామప్రభో ॥ 101 ॥ పాహిరామప్రభో ॥

నారాయణా నీదు నామామృతం బెపుడు
పారాయణము చేతు నేను రామప్రభో ॥ 102 ॥ పాహిరామప్రభో ॥

మాధవాయనియు సమ్మోదమున నినుగొల్చు
సాధుసజ్జనదయాంభోధి రామప్రభో ॥ 103 ॥ పాహిరామప్రభో ॥

గోవింద గోవింద గోపాలకృష్ణయని
గోపకులు గొనియాడు గోపరామప్రభో ॥ 104 ॥ పాహిరామప్రభో ॥

విష్ణునా సర్వవర్ధిష్ణునా తత్త్వ భూ
యిష్ణునా నిర్మితం కృష్ణ రామప్రభో ॥ 105 ॥ పాహిరామప్రభో ॥

శ్రీధరా శ్రీకరా శ్రీనారసింహ గం
గాధర స్తోత్ర యానంద రామప్రభో ॥ 106 ॥ పాహిరామప్రభో ॥

మత్స్యమై జలధిలో జొచ్చి సోమకుద్రుంచి
తెచ్చి వేదము లజునకిస్తి రామప్రభో ॥ 107 ॥ పాహిరామప్రభో ॥

కూర్మరూపము నొంది కొండమూపునదాల్చి
కూర్మితో నమృతంబుగూర్చి రామప్రభో ॥ 108 ॥ పాహిరామప్రభో ॥

వరాహరూపమున వసుధగొమ్ముననెత్తి
సురల రక్షించు దాశరథి రామప్రభో ॥ 109 ॥ పాహిరామప్రభో ॥

శరణన్న ప్రహ్లాదు గరుణించి రక్షింప
నరసింహమూర్తివైనట్టి రామప్రభో ॥ 110 ॥ పాహిరామప్రభో ॥

వామనత్వమున భూదానమడిగియు బలిని
భూమిక్రిందనడంచి పొల్చు రామప్రభో ॥ 111 ॥ పాహిరామప్రభో ॥

పరశురాముడనంగ నరపాలకులనెల్ల
నరసిపొరికొన్న దాశరథి రామప్రభో ॥ 112 ॥ పాహిరామప్రభో ॥

శ్రీరామమూర్తివై యారావణుని తలల్‌
ధారుణిన్‌ పడగూర్చినావు రామప్రభో ॥ 113 ॥ పాహిరామప్రభో ॥

హలధరుడవై ధరాస్థలిపాలకులనెల్ల
బొరిపుచ్చి వెలుగుమాపాలి రామప్రభో ॥ 114 ॥ పాహిరామప్రభో ॥

సిద్ధసన్నుత మనోబద్ధుండవై నీవు
బౌద్ధుండవైతి ప్రబుద్ధ రామప్రభో ॥ 115 ॥ పాహిరామప్రభో ॥

కలికిరూపముదాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రినిలయ రామప్రభో ॥ 116 ॥ పాహిరామప్రభో ॥

అవ్యయుడవైన నీయవతారముల జూచి
దివ్యులైనారు మునులయ్య రామప్రభో ॥ 117 ॥ పాహిరామప్రభో ॥

శ్రీరామనామమే వేళస్మరియింతు
స్వామి దయచేయు సంపదను రామప్రభో ॥ 118 ॥ పాహిరామప్రభో ॥

అప్ప శేషశయన యెప్పుడు నిను మరువ
నొప్పుగా బ్రోవు వరదప్ప రామప్రభో ॥ 119 ॥ పాహిరామప్రభో ॥

తెప్పరంబులుదీర్చి యిప్పుడేమరక నన్‌
ద్రిప్పు బెట్టక చేపట్టు రామప్రభో ॥ 120 ॥ పాహిరామప్రభో ॥

పట్టాభిరామ నీపాదపద్మాశ్రయుల
పాలింపుమా భద్రశైలి రామప్రభో ॥ 121 ॥ పాహిరామప్రభో ॥

పట్టాభిరామ నిను ప్రభుడవని నమ్మితిని
కష్టపెట్టకను చేపట్టు రామప్రభో ॥ 122 ॥ పాహిరామప్రభో ॥

తరచుగా అడిగే ప్రశ్నలు

What is పాహి రామప్రభో?

పాహి రామప్రభో is a devotional text available on Bhakti Granth in the selected language or script.

Which language or script is this version in?

This edition is published in Telugu. Use the language selector to view another available edition.

Can I read పాహి రామప్రభో online?

Yes. The imported text is available directly on this page for online reading and recitation.

Can I download పాహి రామప్రభో as a PDF?

If a verified PDF resource was found on the source page, a PDF download button is automatically connected to this page.

How can I share this page?

Use Copy Link, WhatsApp or Facebook in the sticky sharing bar provided by the Bhakti Granth theme.

Are there related devotional texts on Bhakti Granth?

Yes. The Bhakti Granth theme automatically connects texts through language and topic relationships to strengthen navigation and topical coverage.

WhatsApp Facebook